: ఉద్రిక్తంగా మారిన సివిల్ సర్వీస్ ఉద్యోగార్థుల ఆందోళన


సివిల్ సర్వీసెస్ పరీక్షలో కొత్తగా ప్రవేశపెట్టిన సీశాట్ ను రద్దుచేయాలన్న డిమాండ్ తో గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సివిల్ సర్వీసెస్ లో భాగంగా కొత్తగా సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ (సీఎస్ఏటీ) పేరిట ప్రత్యేకంగా మరో పరీక్షను ప్రవేశపెట్టేందుకు యూపీఎస్సీ దాదాపు తీర్మానించిన నేపథ్యంలో, ఈ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ, ఇతర ప్రాంతీయ భాషల విద్యార్థులకు సీశాట్ వల్ల తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన రెండు నెలలుగా విద్యార్థులు పలుదఫాలుగా ఆందోళనలు నిర్వహించారు. అయితే గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఓ వైపు సీశాట్ రద్దుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే, సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు యూపీఎస్సీ రంగంలోకి దిగింది. ఆగస్టు 24న నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జారీ చేసే ప్రక్రియకు గురువారం తెరలేపింది. దీంతో భగ్గుమన్న విద్యార్థులు ముఖర్జీ నగర్ లో ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన విద్యార్థులు, తమను అడ్డుకునే యత్నం చేసిన పోలీసులపై తిరగబడ్డారు. పోలీసు కంట్రోల్ రూం వాహనానికి నిప్పు పెట్టారు. మరో బస్సును ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ఊహించని వేగంతో గుమిగూడిన విద్యార్థులను నిలువరించేందుకు సరిపడ బలగాలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు పోలీసులపైకి రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడుల్లో 15 మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించగా, విద్యార్థులు పరారయ్యారు. 20 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News