: మోడీ చేత ప్రసంగింపజేయాలని కోరుతున్న యూఎస్ చట్టసభ సభ్యులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు సెప్టెంబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మోడీ చేత కాంగ్రెస్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగింపజేయాలని యూఎస్ చట్టసభ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు 83 మంది సంతకం చేసిన ఓ లేఖను ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోహ్నర్ కు సమర్పించారు. కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా అమెరికా, భారత్ లు ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాయన్నారు. ఈ సంబంధాల బలోపేతానికి మోడీ పర్యటన మరింత ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.