: ఇక దేవాలయాలకు సోలార్ వెలుగులు!
ఇప్పటికే ధూపదీపనైవేద్యం లేక నిత్యం సమస్యలతో సతమతమవుతున్న దేవాలయాలకు ఇకపై కొంతైనా ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ మదిలోని యోచన కార్యరూపం దాలిస్తే, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు సౌర విద్యుత్ వెలుగులతో కాంతులీననున్నాయి. దేవాలయాల నిర్వహణలో భాగంగా వ్యయాలను తగ్గించుకునే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న సర్కారు, సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ సంస్థలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకుంటే, ఇదంత పెద్ద కష్టమైన పనేమీ కాదని భావిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు నిపుణులతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. సాధారణంగా సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం పెద్ద విస్తీర్ణంలో భూములు కావాలి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని 23 వేల ఆలయాల వద్ద పెద్ద సంఖ్యలో భూములున్నాయి. ఒక్కో చోట వందల ఎకరాల విస్తీర్ణంలో ఆలయ భూములున్న విషయం తెలిసిందే. ఈ భూములను, ఆయా ప్రాంతాల్లోని వ్యక్తులు నామమాత్రపు కౌలు చెల్లిస్తూ ఏళ్లుగా అనుభవిస్తున్నారు. అయితే దేవాలయాల్లో ధూపదీపనైవేద్యాల ఏర్పాటుకు సహకారం అందించడం లేదన్న ఆరోపణలు సుదీర్ఘకాలంగా వినిపిస్తున్న సంగతీ తెలిసిందే. తాజాగా మంత్రి యోచన ప్రకారం ఈ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తారు. ఇందులో దేవాదాయ శాఖ అవసరమైనమేర భూములను కేటాయిస్తుంది. ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ చేసుకునే ప్రైవేట్ సంస్థ, విద్యుత్ ప్లాంట్ కయ్యే వ్యయాన్ని భరిస్తుంది. అంతేకాక ఉత్పత్తి అయిన విద్యుత్ ను డిస్కంలకు విక్రయించి, వాటి నుంచే ఆలయాలకు కావాల్సిన విద్యుత్ ను తీసుకుంటారు. దీనిపై అటు ప్రైవేట్ సంస్థలు, ఇటు డిస్కంలతో దేవాదాయ శాఖ వర్గాలు ముమ్మరంగా చర్చలు నిర్వహిస్తున్నాయి. ఈ యత్నాలు కార్యరూపం దాలిస్తే, రాష్ట్రంలోని మొత్తం దేవాలయాలు సౌర వెలుగుల్లో దేదీప్యమానంగా విరాజిల్లనున్నాయి. ఆ దిశగా సర్కారు చర్యలు నిజం కావాలని మనస్పూర్తిగా ఆశిద్దాం.