: ‘బడి పిలుస్తోంది’గా బడిబాట!
విద్యా సంవత్సరం మొదలైన మరుక్షణమే బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాలు ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి. గతేడాది ఈ ఉద్దేశం కోసమే 'బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యా పక్షోత్సవాల పేరిట ప్రత్యేకంగా ఓ పదిహేను రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగాయి. ఇందులో భాగంగా విద్యాశాఖ పరిధిలోని వివిధ విభాగాలు చేపడుతున్న కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలపై అటు విద్యార్థులతో పాటు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఉపాధ్యాయ వర్గం ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంది. తద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదనంతర పరిణామాల్లో రాష్ట్రం రెండుగా విడిపోయింది. కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాల్లోనూ తాజాగా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. దీంతో, కార్యక్రమాల తీరుతెన్నులు కూడా మారిపోనున్నాయి. అయితే కొన్ని కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాంటి వాటి పేర్లను కాస్త అటూఇటుగా మార్పు చేస్తున్న పాలకపక్షాలు కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తుండటం అభినందించదగ్గదే. ఈ కోవలోకి వచ్చేదే బడి బాట... ఏపీలో ఇప్పుడు ‘బడి పిలుస్తోంది’గా నామకరణం చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 25న అనంతపురం జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నటి దాకా బడిలోనే ఉండి, వివిధ కారణాల వల్ల చదువుకు దూరమైన పిల్లలను తిరిగి బడిలో చేర్పించేందుకు వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఆయా జిల్లాల్లో వేల సంఖ్యలో పిల్లలు ఇలా బడికి దూరంగా ఉంటున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అధికారిక గణాంకాలు చెబుతున్న దానికంటే కూడా అధిక సంఖ్యలోనే పిల్లలు బడికి దూరంగా ఉన్నారని క్షేత్రస్థాయి పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. వీరందరినీ తిరిగి బడిలో చేర్పించేందుకు 'బడి పిలుస్తోంది' కార్యక్రమం తప్పనిసరిగా దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ మేర ఫలితాలు సాధిస్తుందన్న దానిపైనే విద్యాశాఖాధికారులు దృష్టి సారిస్తున్నారు. కొత్త సర్కారు తొలుతగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతంగానే ముగించాలని ఆ శాఖ అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. వారి ప్రణాళికలు ఫలించి బడి బయట ఉన్న పిల్లలందరూ బడిలో చేరాలని మనమూ ఆశిద్దాం.