: ఇక రాజధాని అక్కడే..!


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ అన్న మీమాంస దాదాపుగా తొలగినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి గుంటూరు-విజయవాడల మధ్య రాజధాని నిర్మాణం జరిగితే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరచూ చెబుతుండటంతో పాటు పార్టీ శ్రేణులతోనూ ప్రచారం చేయించారు. తాజాగా పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ఏర్పాటైన రాజధాని సలహా కమిటీ చేత కూడా చంద్రబాబు అదే మాట చెప్పించారు. అది కూడా ఏకంగా రాజధాని నిర్ణయానికి సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ముందు. అంటే కేంద్రానికి పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు కేంద్రంలో కొత్తగా పాలనపగ్గాలు చేపట్టిన బీజేపీతో ఎలాగూ పొత్తు పెట్టుకోవడంతో, అక్కడ ఆయన మాట వీగిపోయే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ‘ఇలా చేసేయండి, దీనినే మీరూ ప్రతిపాదించండి’ అన్న చందంగా మంగళవారం నారాయణ కమిటీతో శివరామకృష్ణన్ కు చెప్పించేశారు. 'రాజధాని ఎక్కడన్న విషయం మీరు నిర్దేశించినా, ఆ తర్వాత దానిని అభివృద్ధి చేసుకోవాల్సింది మేమే కదా, మాకు అనుకూలమైన ప్రదేశాన్నే మీరు కూడా ప్రతిపాదిస్తే, వీలయినంత తొందరగా పనులు ప్రారంభించుకోవడంతో పాటుగా మీరు ఊహించని రీతిలో అభివృద్ధి చేసుకుంటాం’ అంటూ మంత్రి నారాయణ, శివరామకృష్ణన్ కమిటీకి తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏపీ సలహా కమిటీకి దాదాపుగా ‘అక్కడేలే’ అన్న హామీ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. శివరామకృష్ణన్ కమిటీని ఒప్పించేందుకు నారాయణ కమిటీ పలు అంశాలను ప్రస్తావించిందట. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘ఆ ప్రాంతం’ సమాన దూరంలో ఉంటుందని, ఇప్పటికిప్పుడు కూడా అక్కడ స్వల్ప ఏర్పాట్లతో పాలన సాగించే అవకావశాలు కూడా అందుబాాటులోనే ఉన్నాయని వివరించినట్లు సమాచారం. ఎక్కడో విశాఖలో రాజధాని ఏర్పాటైతే రాయలసీమ జిల్లాలకు దూరాభారం పెరగడమే కాక, అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదని చెప్పుకొచ్చారట. ఇక భూ లభ్యత విషయాలను తాము చూసుకుంటామని, నీటి వసతి, విద్యుత్తు అందుబాటు తదితర అంశాలకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పేందుకు ఓ నివేదికనే ఆయన ముందుంచారట. అసలే రాష్ట్రంలో అధికార పక్షం. అందునా కేంద్ర సర్కారుకు మిత్రపక్షంగా ఉన్నపార్టీ నేతలు, కాదనకపోతే ఎలా అనుకున్నారో, ఏమో, శివరామకృష్ణన్ కూడా చేసేదేమీ లేక తలాడించేశారట. సో... రాజధానిపై ఇక తర్జనభర్జనలు అనవసరం. సదరు ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు ఎలా అభివృద్ధి చేయనుంది, ఎంతకాలంలోగా పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించనుంది అన్న అంశాలపై ఇకపై చర్చిద్దాం.

  • Loading...

More Telugu News