: శివలింగం చుట్టూ నాగుపాము ప్రదక్షిణలు
నల్లగొండ జిల్లా మేళ్లచెరువులో నిన్న ఓ విశేషం జరిగింది. మేళ్లచెరువులోని శంభులింగేశ్వరస్వామి ఆలయంలోని స్వయం భూశివలింగం చుట్టూ నాగపాము ప్రదక్షిణలు చేసింది. నిన్న ఉదయాన ఆలయ అర్చకులు తలుపులు తెరవగానే నాగుపాము శివలింగం చుట్టూ తిరుగుతూ కనిపించింది. తలుపులు తెరిచిన తర్వాత కూడా పాము అలాగే పడగవిప్పి నాట్యం చేస్తున్న రీతిలో తిరుగుతుండడంతో... ఈ విశేషం చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివలింగం చుట్టూ నాగుపాము ప్రదక్షిణలు చేయడం శివుడి మహిమగా భక్తులు అనుకుంటున్నారు. 11వ శతాబ్దాంలో నిర్మించిన శంభులింగేశ్వరస్వామి ఆలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయంలో స్వయంభూ శివలింగం పైన రెండు అంగుళాల రంధ్రం ఉంది. ఈ రంధ్రంలో సంవత్సరంలోని అన్ని కాలాల్లో నీరు ఊరుతూనే ఉంటుంది. వందల అడుగుల లోతులో తవ్వినా ఈ ప్రాంతంలో నీళ్లు పడవు. అయితే, ఈ శివలింగంలోకి నీళ్లు ఎలా వస్తాయనేది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టని ప్రశ్నే! అలాగే శివలింగం క్రమంగా పెరుగుతోందని స్థానిక అర్చకులు చెబుతున్నారు. శివలింగం 0.305 మీటర్లు ఎత్తు పెరిగినప్పుడల్లా శివలింగం చుట్టూ వృత్తాకార గీతలు ఏర్పడతుండడం విశేషం.