: సిగరెట్లతో కాల్చేవాడు...చంపేస్తాడేమోనని భయపడేదాన్ని: ప్రీతిజింటా
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింటా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియా అసలు స్వరూపాన్ని పోలీసులకు వెల్లడించింది. తనతో ఉండేటప్పుడు నెస్ వాడియా విచిత్రంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొంది. తనతో చాలా దురుసుగా ఉండేవాడన్న ప్రీతి, మాట్లాడుతూ కాలుతున్న సిగరెట్లు విసిరేవాడని తెలిపింది. తనను ఒంటరిగా గదిలో పెట్టి తాళం వేసేవాడని, దారుణంగా కొట్టేవాడని వెల్లడించింది. నెస్ వాడియా ఒక్కోసారి తనను చంపేస్తాడేమోనని భయపడేదాన్నని ప్రీతిజింటా తెలిపింది. జూన్ 30న విదేశాలకు వెళ్ళాల్సిన సందర్భంగా అనుమతి కోసం ఆమె పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను కలిసింది. ఆ సందర్భంగా ఆమె తన మాజీ ప్రియుడిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అందులో నెస్ వాడియా ఆమె తనపై చేసిన ఆకృత్యాలను కళ్లకు కట్టారు. తాను నెస్ వాడియాపై కక్ష తీర్చుకోవాలనుకోవడం లేదని ఆమె స్పష్టం చేసింది. కానీ, తప్పని పరిస్థితుల్లోనే అతనిపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. లేని పక్షంలో ఏదో ఒకరోజు అతను తనను చంపేస్తాడనే భయం తనను వెంటాడుతోందని ప్రీతి తెలిపింది. ఇంతటితో ఇది సమసిపోతుందని తాను భావించడం లేదని అభిప్రాయపడిన ప్రీతిజింటా, ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో నెస్ వాడియా తనకు హాని చేస్తాడని పేర్కొంది. మే 30న ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కింగ్స్ లెవెన్ పంజాబ్ సహయజమాని నెస్ వాడియా ప్రీతి జింటాను స్టేడియంలో అందరిముందు అవమానపరచడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.