: కేంద్ర మంత్రి తో సహ 17మంది తనను అత్యాచారం చేశారన్న మహిళ


కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘవాల్ తనపై అత్యాచారం చేశారని రాజస్థాన్ మహిళ స్పష్టం చేసింది. జాతీయ మహిళా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఏనీ రాజా ఆధ్వర్యంలో ఢిల్లీలో మీడియా సమవేశం ఏర్పాటు చేసిన ఆమె, సూటిగా కేంద్రమంత్రిపై ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘవాల్ సహా పదిహేడు మంది తన భర్త సహకారంతో మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై ఆధారాలు లేవని చెబుతూ పోలీసులు కేసును పక్కదోవపట్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలో నివసిస్తున్న ఆమె ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రశాంత జీవనాన్ని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. అలా జరగాలంటే తనకు న్యాయం చేసి, వీలైనంత తొందర్లో నిందితులకు శిక్ష విధించాలని ఆమె స్పష్టం చేశారు. పలువురి దగ్గర్నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్న ఆమె, తనకు ప్రాణహాని ఉన్నందున పటిష్ఠ భద్రత కల్పించాలని కోరారు. దీనిపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ మహిళా ఫెడరేషన్ అధ్యక్షురాలు ఏనీ రాజా మాట్లాడుతూ, 2011లో నమోదైన ఈ కేసును 2012లోనే పోలీసులు ఎలా మూసేశారని ప్రశ్నించారు. ఈ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీని ఆపాయింట్ మెంట్ కోరామని ఆమె తెలిపారు. దీనిపై ఇప్పటికే బృందా కారత్ ప్రధానికి లేఖ రాశారని ఆమె వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News