: ఆ టీచర్ చేసిన తప్పు 1137 మంది కొంప ముంచింది
బీహార్ లోని మావోయిస్టు ప్రభావిత గిరిజన గ్రామాల్లో కలెక్టర్ నిర్వహించిన గ్రామ సభ వెయ్యిమందికి పైగా టీచర్ల కొంపముంచింది. గ్రామ సభలో అక్కడి స్థానిక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ తన ఇంటికి దగ్గర్లో ఉన్న స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరింది. టీచర్ కోరిక విన్న కలెక్టర్ ఆమె పరిజ్ఞానం పరిశీలించాలనే ఉబలాటం కలిగి ఆమెను రెండు ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. మన రాష్ట్రపతి ఎవరు?, బీహార్ గవర్నర్ ఎవరు? ఆ రెంటికీ ఆమె చెప్పిన సమాధానాలు విన్న కలెక్టర్ ఆమె ఉద్యోగం ఎలా సంపాదించిందో వివరాలు కావాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఇది మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవడంతో ప్రభుత్వం టీచర్ల నియామకాలు, ధ్రువపత్రాల పరిశీలనకు ఆదేశించింది. దీంతో 2.25 లక్షల మంది టీచర్లలో 1137 మంది తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేరిన వారిని తొలగించినట్టు విద్యాశాఖ మంత్రి బ్రిషెన్ పటేల్ తెలిపారు. 147 మంది ముఖియాలు (సర్పంచులు), 27 మంది పంచాయతీ సేవకులను కూడా విధులనుంచి తప్పించినట్టు ఆయన వెల్లడించారు.