: మహిళకు కుచ్చుటోపీ పెట్టిన 'ఫేస్ బుక్ ఫ్రెండ్'


మానవ సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తున్న సోషల్ మీడియా సైట్ ఫేస్ బుక్ తో లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. తాజాగా, ఓ మహిళ భారీ స్థాయిలో మోసపోయింది. ఓ ఫేస్ బుక్ ఫ్రెండ్ ను నమ్మి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది. వివరాల్లోకెళితే... డెహ్రాడూన్ లోని రామ్ విహార్ లో నివాసముండే బీనా బోర్ థంకూర్ అనే మహిళకు ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ముదిరిన తర్వాత ఆ వ్యక్తి బీనాకు ఎరవేశాడు. డెహ్రాడూన్ లో ఓల్డేజి హోం నిర్మించేందుకు రూ.9 కోట్లు ఇస్తానని నమ్మబలికాడు. అయితే, ఆ మొత్తం విడుదల చేసేందుకు పన్నుల రూపేణా రూ. 1.3 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నాడు. ఇది నమ్మిన బీనా ఆ మోసగాడు చెప్పినట్టే చేసింది. పలు అకౌంట్లలో ఆ మొత్తాన్ని జమ చేసిన తర్వాత గానీ జరిగిన మోసం అర్థంకాలేదు ఆమెకు. ఆ వంచకుడు అప్పటి నుంచి పత్తా లేకుండా పోయాడు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది నవంబర్లో రిచర్డ్ ఆండర్సన్ పేరుతో సదరు మోసగాడు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడని, అనంతరం తామిద్దరం ఫోన్ ద్వారా కూడా మాట్లాడుకునే వారమని బీనా తెలిపింది. పేదలకు సేవ చేయాలనుందని, అందుకు రూ.9 కోట్లు ఇస్తానని, దానితో ఏదైనా చెయ్యాలని చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత ఒకరోజు రిజర్వ్ బ్యాంకులోని ఫారెన్ ఎక్చేంజి విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి... నగదు తీసుకెళ్ళాలంటే కొంత మొత్తం చెల్లించాలని తెలిపాడు. దీంతో, ఆమె ఆ నగదును 25 అకౌంట్లలో జమచేసింది. అనంతరం మరో ఇద్దరు వ్యక్తులు విలియం జార్జ్, కెవిన్ బ్రౌన్ పేరిట ఫోన్ చేసి మరింత నగదు కావాలని కోరారు. అప్పటికిగానీ బీనాకు తాను మోసపోయిన విషయం అర్థంకాలేదు. దీనిపై 420 కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఆండర్సన్, జార్జ్, బ్రౌన్ వివరాలు కూపీ లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News