: బ్రిటన్ అమ్మాయిలకూ ఆ కష్టాలు తప్పడంలేదట!
అమ్మాయిలు ఎక్కడైనా అమ్మాయిలే..! వారిపట్ల వివక్ష, వేధింపులు ఏ దేశంలోనైనా ఒకటే. ఇటీవలి కాలంలో బ్రిటన్లో లైంగిక వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో, బాలికలు, మహిళలు తమపై జరుగుతున్న దాడుల పట్ల ఆన్ లైన్ లో ఉద్యమిస్తున్నారట. దీనిపై లారా బేట్స్ అనే మహిళ మాట్లాడుతూ, ఒంటరిగా వస్తుంటే వెంటపడడాలు, కార్లోంచి వెకిలి కూతలు కూయడాలు లండన్ లో నిత్యకృత్యమయ్యాయని తెలిపారు. తాను కొందరు స్త్రీలతో ఈ అరాచకాలపై చర్చిస్తే, వారు తమ జీవితంలోని ఎన్నో ఘటనలను వివరించడం నిర్ఘాంతపరిచిందని బేట్స్ పేర్కొంది. మహిళలపై వేధింపులపై పోరాడేందుకు 'ఎవ్రీడే సెక్సిజమ్ ప్రాజెక్టు' పేరిట రెండేళ్ళ క్రితం బేట్స్ ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ఈ ఆన్ లైన్ వేదిక ద్వారా మహిళలు తమ బాధలను పంచుకోవచ్చు. స్కూళ్ళు, రైళ్ళు, ఆఫీసులు... ఇలా ఎక్కడైనా, మహిళలపై హింసను ఈ సైట్ ద్వారా ప్రశ్నించవచ్చు. ప్రస్తుతం బ్రిటన్లో బాగా ఊపందుకున్న ఈ ఆన్ లైన్ పోరాటానికి రాజకీయనేతలు, పోలీసు విభాగం, వేలాది మహిళలు, చివరికి పురుషులు కూడా మద్దతిస్తున్నారు.