: కాంగ్రెస్ లో ముసలం!మహారాష్ట్ర, అసోం ముఖ్యమంత్రులపై అసమ్మతి తిరుగుబాటు


రెండు నెలల క్రితమే లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయాం నుంచి ఇంకా తేరుకోకముందే...కాంగ్రెస్ పార్టీలో మరో తీవ్ర సంక్షోభం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, అసోం ప్రభుత్వాలపై సొంతపార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ కేబినెట్ నుంచి సీనియర్ మంత్రి నారాయణ్ రాణే, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ సర్కార్ నుంచి హిమంత బిశ్వాస్ శర్మ సోమవారం రాజీనామా చేయడంతో ఈ రాష్ట్రాల్లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే చవాన్ ను తొలగించాలంటూ రాణేతో పాటు మహారాష్ట్రకు చెందిన అనేక మంది సీనియర్ మంత్రులు, నాయకులు కాంగ్రెస్ హైకమాండ్‌పై వత్తిడి తెచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటి నుంచీ చవాన్ కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతూనే వచ్చాయి. రాణే రాజీనామాతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇక అస్సాం విషయానికొస్తే...లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ అసమర్థ నాయకత్వమే కారణమంటూ అస్సాం కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. సీనియర్ మంత్రి హిమంత బిశ్వాస్ శర్మ నాయకత్వంలో 38మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరుణ్ గగోయ్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సోమవారం వరకూ డెడ్‌లైన్ విధించారు. అయినా హైకమాండ్ నోరుమెదపక పోవడంతో హిమంత బిశ్వాస్ శర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన సారథ్యంలో 38మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్ జెబి పట్నాయక్‌ను కలుసుకుని గగోయ్ పట్ల తమకు ఎలాంటి విశ్వాసం లేదని స్పష్టం చేశారు. అయితే రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా రాణే, శర్మలు రాజీనామా చేసి....వెనక్కి తగ్గారని ఇప్పుడు కూడా అదే విధంగా రాజీకొస్తారన్న నమ్మకాన్ని ఏఐసీసీ వర్గాలు వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News