: టీపీసీసీ చీఫ్ గా మల్లు భట్టివిక్రమార్క?


టీపీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్యను తప్పించడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పొన్నాల లక్ష్మయ్యపై గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఎన్నికలప్పుడు ముఖ్య నేతలను సమన్వయపరిచి కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చడంలో ఆయన విఫలమయ్యారన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పొన్నాల లక్ష్మయ్య పూర్తిగా ఫెయిల్ అయ్యారని పార్టీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు కూడా పొన్నాలపై బాహాటంగా విమర్శలు చేశారు. పొన్నాల తీరుపై హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి విరివిగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నాలను తొలగించకపోతే కాంగ్రెస్ కు తెలంగాణలో భవిష్యత్తు ఉండదని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. పొన్నాల లక్ష్మయ్య బదులు వ్యూహాత్మకంగా పార్టీని నడిపించగల మల్లు భట్టివిక్రమార్కకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలనే భావనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News