: అక్క కళ్ల ముందే చెల్లెలిని ఒకరి తరువాత ఒకరు చెరిచారు
ఉత్తర భారతదేశంలో మహిళలపై అకృత్యాలు మితిమీరిపోతున్నాయి. కామాంధులు పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్నారు. సన్నిహితుల సమక్షంలోనే అత్యాచారాలకు ఒడిగడుతూ మహిళల భద్రతకు సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని సారన్ జిల్లాలోని గోవింద్ చక్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సు తన ఇద్దరు కుమార్తెలతో జీవిస్తోంది. డ్యూటీ నిమిత్తం తల్లి ఆసుపత్రికి వెళ్లడంతో, 9వ తరగతి చదువుతున్న బాలిక (16) తన అక్కతో కలిసి నిద్రిస్తున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. వివాహిత అయిన అక్కను కుర్చీకి తాళ్లతో కట్టేసి, ఆమె కళ్ల ముందే చెల్లెలిపై అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వివాహిత మెడలోని మంగళసూత్రం, ఇతర ఆభరణాలు, కొంత డబ్బు తీసుకుని పరారయ్యారు. బాధితులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన అత్యాచారం బీహార్ అసెంబ్లీని కుదిపేసింది. అది మర్చిపోకముందే మరో అత్యాచారం చోటుచేసుకోవడం దారుణం.