: 'హేమమాలిని మిస్సింగ్' అంటూ మధురలో పోస్టర్లు


ఓ నియోజకవర్గంలో స్థానికేతరులు పోటీచేసి గెలుపొందడం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే చిక్కులు మొదలవుతున్నాయి. అలా గెలిచిన వాళ్ళు స్థానికులకు అందుబాటులో ఉండడం లేదని ఎన్ని వార్తలో. ఇటీవలి ఎన్నికల్లో మధుర లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలిని కూడా ఈ కోవలోకే వస్తారు. బీజేపీ తరఫున పోటీచేసిన ఈ నటీమణి ప్రత్యర్థి జయంత్ చౌధరిపై ఘనవిజయం నమోదు చేసుకున్నారు. అయితే, గెలిచిన తర్వాత కేవలం ఒక్కరోజు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారట. దీంతో, అక్కడి ప్రజలు హేమమాలినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హేమమాలిని మిస్సింగ్ అంటూ పోస్టర్లు అతికించడమే గాకుండా, ఆమె దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. ప్రధాని మోడీ అంతటివాడే గెలిచిన మరునాటి నుంచే రంగంలోకి దిగితే, కొత్తగా గెలిచిన హేమమాలిని మాత్రం ఇంకా బాధ్యతలు తీసుకోలేదన్నది ఓ నిరసనకారుడి వ్యాఖ్య. బాలీవుడ్ నటిని ఎన్నుకోవద్దని తమను ప్రతి ఒక్కరూ హెచ్చరించారని, అయితే, మధుర ప్రజలు ఆమెపై విశ్వాసం ప్రకటించారని అక్కడి కార్మిక సంఘం అధ్యక్షుడు తారాచంద్ గోస్వామి అన్నారు. ఆమె కంటే స్మృతి ఇరానీ ఎంతో మేలని గోస్వామి అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి నిర్వహిస్తూ కూడా ఇరానీ అమేథీలో నెలకోసారైనా పర్యటిస్తుంటారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News