: న్యాయవ్యవస్థలో అవినీతిపై మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు
న్యాయవ్యవస్థలో అవినీతిపై భారతీయ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఓ జిల్లా జడ్జిగా ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ అతనిని మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమించారని అన్నారు. అయితే, ఆ కళంకిత న్యాయమూర్తిని జడ్జిగా డైరెక్ట్ గా నియమించారని చెప్పారు. అంతేగాక హైకోర్టులో అతనికి వ్యతిరేకంగా ఎనిమిది ప్రతికూల ఎంట్రీలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఓ చీఫ్ జస్టిస్ వాటన్నింటినీ తొలగించడంతో సదరు వ్యక్తి హైకోర్టులో అదనపు జడ్జి అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నింటినీ ఖట్జూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ఈ విషయంలో ఆ వ్యక్తికి తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత నుంచి గట్టి మద్దతు ఉందని చెప్పారు. తర్వాత ఆయనకు ఓ కేసులో సదరు జడ్జి బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ సీ లాహోతి కూడా ఆ అవినీతి జడ్జి కొనసాగేందుకు రాజీపడి అనుమతించారన్నారు. ఇలా ఆరోపణలు ఉన్నప్పటికీ సదరు జడ్జిని కొనసాగేందుకు మాజీ చీఫ్ జస్టిస్ లు అంగీకరించారన్నారు. ఈ ఘటన డీఎంకేతో పొత్తు సమయంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని వెల్లడించారు. అంటే జడ్జిల నియామకంలో రాజకీయ జోక్యం ఎంతవరకు ఉందనేదానికి ఇదొక కళ్లు చెదిరిపోయే ఉదాహరణ అని ఖట్జూ పేర్కొన్నారు. అటు ఈ అంశంపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడి వాయిదాపడింది.