: ఆ హోటల్ పేరు చెబితే వణికిపోతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు!
ఇంగ్లండ్ క్రికెటర్లకు ఓ కొత్త భయం పట్టుకుంది. లండన్ లోని లాన్హామ్ హోటల్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. క్రికెటర్లతో పాటు వారి భార్యలు, గాళ్ ఫ్రెండ్స్ కూడా "ఇక్కడైతే వద్దు బాబోయ్" అంటున్నారట. ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా రాత్రివేళల్లో అక్కడ వింత శబ్దాలు వినపడ్డాయని ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ అంటున్నాడు. తాము నిద్రపోతుండగా, బాత్రూంలోంచి ఏవో శబ్దాలు వచ్చాయని, లైట్లు వేయగానే ధ్వనులు ఆగిపోయాయని తెలిపాడు. అయితే, లైట్లు ఆర్పగానే శబ్దాలు మళ్ళీ వినవచ్చి తనకూ, తన గాళ్ ఫ్రెండ్ కూ కంటిమీద కునుకు దూరం చేశాయని వాపోయాడు. మిగతా క్రికెటర్లకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయట. దీంతో, వారు లార్డ్స్ లో మ్యాచ్ ల సందర్భంగా తమ బసను మార్చాలని కోరుతున్నారు. 1865లో నిర్మితమైన ఈ హోటల్ మార్క్ ట్వయిన్, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ కానన్ డయల్ వంటి సుప్రసిద్ధ రచయితలకు విడిదిగా పేరుపొందింది. అయితే, ఈ హోటల్లోని 333వ నెంబర్ రూం భయానకచరిత్ర సొంతం చేసుకుంది. 1973లో ఈ రూంలో బసచేసిన జేమ్స్ గోర్డాన్ అనే బీబీసీ రేడియో అనౌన్సర్ కు రాత్రి వేళ అకస్మాత్తుగా మెలకువ వచ్చిందట. లేచి చూడగా, ఓ కాంతులీనుతున్న బంతి వంటి ఆకారం క్రమేణా మానవరూపం సంతరించుకుందట. ఏం కావాలని గోర్డాన్ ఆ ఆకారాన్ని ప్రశ్నించగా, అది గాల్లో తేలుతూ మీదికి రావడంతో సదరు మహాశయుడు అక్కడి నుంచి పరారయ్యాడని ఈ హోటల్ కు చెందిన వెబ్ సైట్లో పొందుపరిచారు.