: రుణం అందేదెన్నడో..!


అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై అప్పటికే నెల రోజులు కావస్తోంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ రుణాల మంజూరు మొదలు కాలేదు. ఇరు రాష్ట్రాల్లో ఇటీవల అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వాలు, ఇప్పటికే బ్యాంకర్లతో భేటీలు నిర్వహించాయి. అయితే, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, టీడీపీలు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు గుప్పించాయి. వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రెండు ప్రభుత్వాలు కూడా కార్యరంగంలోకి దిగాయి. అయితే రుణ మాఫీకి సంబంధించి, ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ దిశానిర్దేశంలోనే రుణాల రీషెడ్యూల్ అయినా, మాఫీ అయినా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులుగా బ్యాంకు, ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నా, అవి నేటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో రుణాల మాఫీ కూడా ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. గతేడాది మంజూరు చేసిన రుణాల విషయం తేలితేనే కానీ, కొత్త రుణాల మంజూరుపై నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు తెగేసి చెప్పారు. అయితే ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు వస్తే కానీ, పాత రుణాల పరిస్థితిపై ప్రభుత్వాలు నోరు మెదిపేందుకు వీలు కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కొత్త రుణాలను మంజూరు చేయలేమన్నది బ్యాంకర్ల వాదన. ఇదిలా ఉంటే ఖరీఫ్ ప్రారంభమై నెల కావస్తున్నా, ఆశించిన మేర వర్షపాతం లేకపోవడం, కొత్త రుణాలు అందకపోవడంతో సాగుపై రైతన్న దృష్టి సారించలేదు. దీంతో రెండు రాష్ట్రాల్లో సాగు నెమ్మదించింది. ఫలితంగా వాస్తవ సాగులో సగం కూడా నమోదు కాలేదు. సాగు మొదలెట్టాలంటే, అందుకు సరిపడ పైకం కూడా ఉండాలి కదా అన్నది రైతుల వాదన. ఇందుకోసమే బ్యాంకుల వద్దకెళితే, పాత రుణం సంగతి తేల్చండి, ఆ తర్వాత కొత్త రుణం గురించి మాట్లాడదాం అంటూ సమాధానం ఎదురవుతోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు గత ఖరీఫ్ సందర్భంగా కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామంటున్న బ్యాంకర్ల నోటీసులతో రైతులు ఆందోళనలో కూరుకుపోయారు. ఇన్ని అవాంతరాల నేపథ్యంలో సాగెలా చేపట్టేదన్న ప్రశ్న రైతుల నుంచి వినిపిస్తోంది. మరి ఈ అవాంతరాలన్నీ ఎప్పడు తొలగుతాయన్న ప్రశ్నపైనే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ భవితవ్యం ఆధారపడి ఉంది.

  • Loading...

More Telugu News