: ఆమ్లా సాహసోపేత నిర్ణయం... చతికిలబడిన లంకేయులు
శ్రీలంకతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ముగిసేందుకు ఒకటిన్నర రోజుల సమయం ఉండగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కెప్టెన్ హషీమ్ ఆమ్లా నిర్ణయం సరైనదేనని సఫారీ బౌలర్లు నిరూపించారు. గాలే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 216 పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును హడలెత్తించిన డేల్ స్టెయిన్ (4/45) రెండో ఇన్నింగ్స్ లోనూ నిప్పులు చెరిగాడు. స్టెయిన్ కు మోర్కెల్ (4/29) జతకలవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. అంతకుముందు ఆమ్లా తమ రెండో ఇన్నింగ్స్ ను ముందే డిక్లేర్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఎంతో సమయం మిగిలుండగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే లంక కూడా లక్ష్యఛేదనలో నాలుగోరోజు ఆట చివరికి వికెట్ నష్టానికి 110 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. దాంతో, ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయమనే అనుకున్నా... పేసర్ల సూపర్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికా అద్భుత విజయం నమోదు చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. రెండో టెస్టు జులై 24 నుంచి కొలంబో వేదికగా జరగనుంది.