: సిగరెట్ల కంపెనీపై అమెరికా కోర్టు భారీ జరిమానా
‘మీ సిగరెట్లు తాగి ఓ వ్యక్తి మరణించాడు. అతడి భార్యకు పరిహారంగా రూ. 2,300 కోట్ల (23. బిలియన్ డాలర్లు) మేర నష్టపరిహారం చెల్లించండ’ని అమెరికా కోర్టు సిగరెట్ల తయారీలోని ఆర్ కే రీనాల్డ్స్ ను ఆదేశించింది. 1996లో తన భర్త మరణానికి కారణం ఆర్ కే రీనాల్డ్స్ తయారు చేసిన సిగరెట్లేనని సింథియా రాబిన్సన్ అనే మహిళ 2008లో వేసిన కేసును నాలుగు వారాల పాటు సుదీర్ఘంగా విచారించిన కోర్టు, చివరకు సిగరెట్లు తాగిన కారణంగానే ఆ వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించాడని తేల్చింది. దీంతో సదరు పరిహారాన్ని బాధితుడి భార్యకు చెల్లించాల్సిందిగా తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు సబబుగానే ఉంది కాని పరిహారమే మరీ భారీగా ఉందని తీర్పు వెలువడిన అనంతరం రీనాల్డ్స్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. సిగరెట్లు విక్రయించే ముందు దాని పర్యవసానాల గురించి తగిన రీతిలో కంపెనీ హెచ్చరికలు జారీ చేయలేదని రాబిన్సన్ వాదించారు.