: నెల్లూరు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వైఎస్సార్సీపీవే!
నెల్లూరు జడ్పీ పీఠం వైఎస్సార్సీపీకే దక్కింది. ఆదివారం 3 గంటలకు లాటరీ పద్ధతిన జరిగిన ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఛైర్మన్ గా, అదే పార్టీకి చెందిన శిరీష వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీకాంత్ ఆదివారం మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని 46 జడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీ 31 స్థానాలను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ జడ్పీటీసీలు ఎనిమిది మంది ఆ తర్వాత పార్టీ ఫిరాయించి, టీడీపీ వైపు వెళ్లారు. దీంతో ఇరు పార్టీల బలం 23 వద్ద సమమైంది. తత్ఫలితంగా ఛైర్మన్ ఎన్నికపై ప్రతిష్ఠంభన నెలకొంది. దీనిపై జిల్లా అధికారులు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి, లాటరీ పద్ధతిని ఆశ్రయించాలని తీర్మానించారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు ఆలస్యంగా జడ్పీకి రావడం, ఇరు పార్టీల సభ్యుల మధ్య వాాదోపవాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ రెండుసార్లు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా లాటరీ పద్ధతిననే జరగగా, రెండు పదవుల్లో టీడీపీ, వైెస్సార్సీపీ చెరొకటి చొప్పున దక్కించుకున్నాయి. కో-ఆప్షన్ సభ్యులతో కలుపుకున్నా, ఇరుపార్టీల బలం సమంగా ఉండటంతో జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక కూడా లాటరీ పద్ధతిననే నిర్వహించాల్సి వచ్చింది. తీవ్ర ఉత్కంఠ మధ్య 3 గంటలకు జరిగిన లాటరీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు రెండింటినీ వైఎస్సార్సీపీనే కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ గా శిరీషా ఎన్నికైనట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు.