: రెండో టెస్టు... తొలి రెండు గంటలు అత్యంత కీలకం


ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో ఇప్పటి వరకు 145 పరుగుల ఆధిక్యత సాధించినట్టైంది. ఒకానొక సమయంలో 118/1 దగ్గర పటిష్ఠంగా ఉన్న భారత్... ఆ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోలేకపోయింది. 40 పరుగుల వద్ద ధావన్ (31) వికెట్ కోల్పోయిన తర్వాత విజయ్, పుజారా అద్భుతమైన డిఫెన్స్ తో ఇంగ్లిష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. భారత్ 118 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్లంకెట్ టీమిండియాను దెబ్బ తీశాడు. వరుస బంతుల్లో పుజారా (43), కోహ్లీ (0)లను పెవిలియన్ చేర్చాడు. కోహ్లీ గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే ఔట్) అయ్యాడు. అనంతరం రహానే (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ క్రమంలో 123/4 దగ్గర భారత్ కష్టాల్లో పడినట్టే అనిపించింది. అయితే, విజయ్ (59*), ధోనీ (12*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 1, స్టోక్స్ 1, ప్లంకెట్ 2 వికెట్లు తీశారు. అంతకు ముందు 219/6తో తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లండ్ అద్భుత పోరాట పటిమను కనబరిచింది. ప్లంకెట్ అద్భుతంగా ఆడి 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ 319 పరుగుల స్కోరు చేసి... కీలకమైన 24 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఈ రోజు (నాలుగో రోజు) తొలి రెండు గంటలు భారత్ కు అత్యంత కీలకం కానున్నాయి. ఫలితం కచ్చితంగా వస్తుందని భావిస్తున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందా? ఓటమిని మూటగట్టుకుంటుందా? అనేది తొలి సెషన్లోనే తేలిపోనుంది. ఉదయం పేసర్లకు సహకరించే పిచ్ పై విజయ్, ధోనీలు నిలకడగా ఆడితే భారత్ గెలుపు ముంగిట నిలిచినట్టే... లేదంటే, విదేశాల్లో మరో పరాభవం తప్పదు.

  • Loading...

More Telugu News