: శవం అనుకుని భ్రమపడ్డ పోలీసులు... తమ పనికి తామే నవ్వుకున్నారు!
అనంతపురం పట్టణంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. సూర్యనగర్ నుంచి రాజా, రమణ రమేష్ గ్రూప్ థియోటర్ కు వెళ్లే మార్గంలో వంతెన వద్ద డ్రైనేజీలో పాదచారులకు అనుమానాస్పదంగా ఓ మూట కన్పించింది. గోనె సంచి రంధ్రంలోంచి గీతల చొక్కా, తెల్లటి వెంట్రుకలు కన్పించాయి. దానిని వృద్ధుడి మృతదేహంగా భావించిన పాదచారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వన్ టౌన్, టూటౌన్ సీఐలు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకున్నారు. 'మా పరిధి కాదంటే మాపరిధి కాదు' అంటూ కాసేపు వాదులాడుకున్నారు. టూటౌన్ సీఐ కేసు నమోదు చేసేందుకు సిద్ధపడి మూటను తెరవకుండానే ప్లాస్టిక్ కవర్ లో భద్రంగా ప్యాక్ చేసి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తీసుకెళ్లారు. నిందితుల్ని పట్టుకుంటామని మీడియాకు తెలిపారు. ఇక్కడే తమాషా చోటు చేసుకుంది. డీఎస్పీ, సీఐ ఆసుపత్రి బయట వేచి ఉండగా, పోస్టుమార్టం కోసం కానిస్టేబుళ్ల సమక్షంలో ఆసుపత్రి సిబ్బంది సంచి తెరిచారు. అంతే... ఎలా రియాక్టవ్వాలో తెలీక షాక్ తిన్నారు. తరువాత తమలో తామే నవ్వుకుని డీఎస్పీ, సీఐలకు విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న వారు కూడా నవ్వుకుంటూ వెనుదిరిగారు. ఇంతకీ సంచిలో ఉన్నది ఏంటయ్యా అంటే... ఓ కుక్క. కుక్కకు షర్టు వేసిన దాని యజమాని అది మరణించడంతో అలా డ్రైనేజీలో పడేశాడు. అది పోలీసుల మధ్య వివాదం రేపి, నవ్వులు విరబూయించింది.