: ఫేస్ బుక్ లో మీ ఫొటోలు పెడుతున్నారా?... అయితే, మీలో పోటీతత్వం లేనట్టే!
సాంకేతిక విప్లవం చేతిలోకి వచ్చేసింది. కెమెరా, ఇంటర్నెట్ అరచేతిలో ఇమిడిపోతున్నాయి. దానికి తోడు సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల యుగం నడుస్తోంది. యువతకు అకౌంట్ల సంఖ్య పెంచుకోవడం ఓ క్రేజ్. వాట్సప్, ఫేస్ బుక్, హైక్, ఒకటేమిటి రోజుకో కొత్త సైట్... అందులో ఓ అకౌంట్... దానిలోని మిత్రులతో చిట్ చాట్ దిన చర్యగా మారిపోయింది. అందులో లేటెస్ట్ అప్ డేట్ తో ఓ ఫోటో పెట్టడం మిత్రులతో లైక్ కొట్టించుకోవడం, ఓ కాంప్లిమెంట్ పొందడం క్రేజీ వ్యవహారమైపోయింది. వివిధ అంశాలను షేర్ చేసుకోవడం మామూలైపోయింది. ఈ రకమైన తీరుపై అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ మానసిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులోని ఫలితాలు కాస్త ఆలోచింపజేస్తున్నాయి. అందమైన, సెక్సీ ఫొటోలు పోస్టు చేస్తున్న అమ్మాయిల్లో పోటీతత్వం లేదనే అభిప్రాయం సహచర యువతుల్లో కనిపిస్తోందని పరిశోధన తెలిపింది. శారీరకంగా లేదా సామాజికంగా అంత ఆకర్షణీయంగా లేనివారే తరచూ ఫొటోలు పెడుతుంటారని ఆ పరిశోధన స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఫొటోల పట్ల తక్కువ భావన ఉందన్నది సుస్పష్టమని సైకాలజీ విభాగాధిపతి ఎలిజబెత్ డానియెల్స్ తెలిపారు. తమను తాము అందంగా, సెక్సీగా చూపించుకోవాలన్న తపన టీనేజ్ యువతుల్లో ఉంటుందని డానియెల్స్ స్పష్టం చేశారు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వలన లాభాల కంటే నష్టాలే అధికమని ప్రొఫెసర్ వివరించారు. ఎక్కువ ఫొటోలు పెడితే అబ్బాయిల ఆకర్షణ కోల్పోతారని డానియెల్స్ హెచ్చరించారు.