: గుజరాత్ తరహాలో ప్రధానమంత్రి సహాయనిధిలో మార్పులు
ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సహాయనిధిలో నరేంద్రమోడీ భారీ మార్పులు చేపట్టారు. గతంలో తను ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన గుజరాత్ పథకం తరహాను అనుసరించాలని సూచించారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు, పేదలు, పిల్లలకు మాత్రమే నిధి నుంచి సహాయం అందేలా చూడాలని అధికారులుకు చెప్పారు. ఆ మేరకు ఈ రోజు సహాయనిధి పనితీరు, ఫండ్ విధానంలో అనుసరించాల్సిన నాణ్యతాపరమైన మార్పులపై అధికారులతో మోడీ సమీక్ష నిర్వహించారు. గుజరాత్ తరహాలోనే లబ్ధిదారులను సమగ్రంగా, శాస్త్రీయ, మానవతా ప్రాతిపదికన ఎంపిక చేయాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అంతేకాక ప్రాణాంతక రోగాలతో బాధపడుతున్న వారికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చెప్పినట్లు వివరించింది. సహాయం కోసం వస్తున్న విజ్ఞప్తులను క్రమంగా తగ్గించాలని చెప్పినట్లు తెలిపింది. వాస్తవ సంఘటనలకు సంబంధించిన వాటిని గుర్తించి సాయం చేయాలని ప్రధాని చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.