: పార్టీని బతికించుకోకుంటే తెలంగాణ మరో తమిళనాడే: వీహెచ్
కాంగ్రెస్ హైకమాండ్ పై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎందుకు ఓడిపోయారని ఢిల్లీలో అడుగుతుంటే తలవంచుకుంటున్నామన్నారు. ఢిల్లీలో కూర్చుని నాయకులను ఎంపిక చేస్తే కుదరదని పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికలో ఫర్మానాలు, సొంత కవిత్వాలు కట్టిపెట్టాలని పార్టీకి సూచించారు. రాష్ట్రానికి వచ్చి అందరితో మాట్లాడి పీసీసీ చీఫ్ ను నియమించాలని పార్టీని డిమాండ్ చేశారు. కాగా, పొన్నాలను తీసేస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఐదేళ్లలో పార్టీని బతికించుకోకుంటే తెలంగాణ మరో తమిళనాడు అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ వ్యవహారాల్లో ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతోందన్న వీహెచ్... ఇదిలాగే కొనసాగితే కార్యకర్తలు తిరగబడతారన్నారు. టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే వ్యక్తే టీ పీసీసీ అధ్యక్షుడు కావాలని చెప్పారు.