: నగరం నడిబొడ్డున విలువైన భూమిపై కన్నేసిన మజ్లిస్!
మాసాబ్ టాంక్.. హైదరాబాద్ కు ఓ రకంగా నడిబొడ్డున ఉన్న ప్రదేశం. పలు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలకు వచ్చే ఉద్యోగులు, విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమిది. అందుకే ఈ ప్రాంతంలో స్థలాల రేట్లు ఆకాశాన్నంటుతుంటాయి. అందుకేనేమో, ఇక్కడ ఉన్న ఏపీ రైడింగ్ క్లబ్ ల్యాండ్ పై మజ్లిస్ కన్నేసింది. కోట్ల విలువైన భూమిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది.
అయితే, ఆ భూమిని నూతన కార్యాలయం నిర్మాణం కోసమని హెచ్ఎండీఏకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, సీఎంను కలిసిన మజ్లిస్ శాసనసభ్యుడు విరాసత్ రసూల్ ఖాన్ ఆ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ ప్రతి నియోజకవర్గంలో ఓ క్రీడా సముదాయం నిర్మిస్తామని ఇటీవలే ప్రకటించడాన్ని రసూల్ ఖాన్ ఉదహరించారు. తన నియోజకవర్గం నాంపల్లికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదని.. మహావీర్ ఆసుపత్రి సమీపంలోని ఈ ఒకటిన్నర ఎకరం రైడింగ్ క్లబ్ భూమి అయితే క్రీడా సముదాయానికి సరిగ్గా సరిపోతుందని అన్నారు.
ఈ విషయమై ఆయన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను కూడా సంప్రదించారు. హెచ్ఎండీఏ తన కార్యకలాపాలన్నీ నగరం వెలుపలే నిర్వహించుకుంటోందని, అలాంటప్పుడు కార్యాలయం నగరం నడిబొడ్డున ఎందుకని ఆయన ప్రశ్నించారు. హెచ్ఎండీఏకి బంజారాహిల్స్ లో భూమి ఉందని అక్కడ వారు కార్యాలయం నిర్మించుకోవచ్చని రసూల్ ఖాన్ సూచించారు.
కొద్దికాలం క్రితం బేగంపేటలో ఉన్న యూఎస్ కాన్సులేట్ ప్రాంగణం నుంచి హెచ్ఎండీఏ తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. అప్పటినుంచి శాశ్వత కార్యాలయ నిర్మాణానికి తగిన స్థలం కోసం అన్వేషిస్తూనే ఉంది. తాజాగా మజ్లిస్ ప్రయత్నాలతో హెచ్ఎండీఏ 'ఆఫీసు' కోసం మరికొద్ది కాలం వేచి ఉండక తప్పదేమో!