: జైల్లో నిరాహారదీక్షకు దిగిన రాజీవ్ హంతకురాలు నళిని
భర్త మురుగన్ ను చూసేందుకు అనుమతించలేదని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని వేలూరు సెంట్రల్ జైల్లో నిరాహార దీక్షకు దిగింది. రాజీవ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న దంపతులు నళిని, మురుగన్ లు వేర్వేరు బ్యారక్ లలో ఉంటారు. ప్రతి పదిహేను రోజులకోసారి వారిద్దరూ కలుసుకునేందుకు గతంలో న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న వారు కలవాల్సి ఉన్నా పోలీసులు అనుమతించలేదు. కొన్ని రోజుల కిందట మురుగన్ నుంచి సెల్ ఫోన్, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని కారణంగానే కలవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నళిని ఆహారం తీసుకోకుండా దీక్ష చేపట్టింది. దాంతో, జైలు అధికారులు ఆమెతో మాట్లాడినా మొన్నంతా (గురువారం) భోజనం చేయలేదట. భర్తను చూడకుండా ఉండలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుందని అధికారులు తెలిపారు. కానీ, సర్దిచెప్పాక నిన్న (శుక్రవారం) ఆహారం తీసుకుందని తెలిపారు.