: చైర్ పర్సన్ చీరలాగి, వెంటపడి కొట్టిన వైసీపీ కార్యకర్తలు
ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్ పర్సన్ కొప్పాడ పార్వతికి ఘోర అవమానం ఎదురయ్యింది. శుక్రవారం కౌన్సిల్ సమావేశానికి వచ్చిన కొప్పాడ పార్వతిపై వైసీపీ మహిళా కార్యకర్తలు అకస్మాత్తుగా దాడి చేశారు. కౌన్సిల్ సమావేశానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తల ఎదుటే వైసీపీ మహిళా కార్యకర్తలు ఆమె చీర లాగి, వెంట పడి మరీ కొట్టారు. ఆఖరుకు పోలీసులు వచ్చే వరకు పరిస్థితి సద్దుమణగలేదు. పోలీసుల రక్షణతో కొప్పాడ పార్వతి కౌన్సిల్ హాల్ లోకి వెళ్లాల్సి వచ్చింది. విషయం ఏమిటంటే... ఏలేశ్వరం ఛైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ స్థానాలు దక్కినా... పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో వైసీపీకి చెందిన కొప్పాడ పార్వతిని తమ వైపుకు తిప్పుకుని ఏలేశ్వరం చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. దీంతో చాలాకాలంగా వైసీపీ కార్యకర్తలు కొప్పాడ పార్వతిపై ఆగ్రహంగా ఉన్నారు.