: జీతాల కోసం అప్పులు చేస్తున్న ఓయూ
హైదరాబాద్ లోనే కాక దేశవ్యాప్తంగా పేరుప్రతిష్ఠలున్న ఉస్మానియా యూనివర్శిటీ అప్పుల బాట పడుతోంది. సిబ్బంది వేతనాల చెల్లింపు కోసం వర్సిటీ అధికారులు బ్యాంకు రుణాల కోసం పరుగులు పెడుతున్నారు. మరోవైపు వ్యయాలు, ప్రభుత్వం విడుదల చేస్తున్న గ్రాంట్ల మధ్య భారీ వ్యత్యాసం కూడా ఓయూను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. ఉస్మానియా వర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, వర్సిటీ నిర్వహణ వ్యయం నెలకు రూ. 27 కోట్ల మేర ఉంటోంది. అయితే సర్కారు నుంచి మాత్రం నెలకు రూ. 14 కోట్లు మాత్రమే విడుదలవుతున్నాయి. అది కూడా నెలకోసారి కాకుండా మూడు నెలలకోమారు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. తాజాగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో క్వార్టర్ నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. దీంతో జూన్ నెల వేతనాలు చెల్లించేందుకు బ్యాంకు రుణం తీసుకుని ఓయూ గట్టెక్కింది. ఇక జులై నెల మరో 10 రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ సదరు నిధులు విడుదల కాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వర్సిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఏటా పెరుగుతున్న పెన్షన్లు కూడా వర్సిటీకి భారంగా పరిణమిస్తున్నాయి. కేసీఆర్ గద్దెనెక్కిన నేపథ్యంలోనైనా వర్సిటీ వెతలు తప్పుతాయేమో చూద్దాం.