: దొనకొండకు పారిశ్రామిక కళ!


ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని దొనకొండ మండలంలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఇకపై పారిశ్రామిక కళతో అలరారనున్నాయి. దొనకొండ మండల పరిధిలో 54 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎక్కడ జరగాలన్న చర్చ సందర్భంగా ఈ భూముల వినియోగానికి సంబంధించిన అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. వేల ఎకరాల సర్కారు భూములున్న ప్రకాశం జిల్లాలోనే ఏపీ కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటు కాకపోయినప్పటికీ, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న దొనకొండ భూములు ఇకపై భారీ పరిశ్రమల ఏర్పాటుతో కొత్త శోభతో కాంతులీననున్నాయి. శుక్రవారం మలేసియా ప్రతినిధి బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ప్రకాశం జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారు. భేటీలో భాగంగా దొనకొండ భూముల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను స్థాపించేందుకు మలేసియా ప్రతినిధి బృందం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. కోస్టల్ కారిడార్ పొడవునా రహదారి నిర్మాణం, దానివెంట పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుసంధానంగా ఇతర ప్రాంతాల్లో కూడా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఈ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఏ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశం చర్చకొచ్చింది. దీనిపై మరింత లోతుగా పరిశీలన జరపాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News