: కరవమంటే కప్పకు... విడవమంటే పాముకు కోపమన్నట్టు..!
తెలంగాణలో కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్ కు సంబంధించిన అంశంపై ఆ రాష్ట్ర సర్కారు తాజాగా ఎదుర్కొంటున్న పరిస్థితి అచ్చం పై సామెత చెప్పినట్లే ఉంది. అధికారంలోకి రాగానే, కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్న ఆయన ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేశారు. ఇక హామీల అమలుపై దృష్టి సారించాల్సిందే కదా! ఇదే అదనుగా పలు శాఖల్లో కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న ఉద్యోగుల సంఘాలు సీఎంను కలుస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మీకు న్యాయం చేస్తామంటూ, కేసీఆర్ కూడా వారిపట్ల సానుకూలంగానే స్పందిస్తున్నారు. అయితే, రెండు రోజులుగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు తీవ్రంగా ఆందోళనలు సాగిస్తున్నారు. అయితే వీరి ఆందోళనలు ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ల కోసం కాదట. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయరాదన్న డిమాండ్ తో వారు ఈ ఆందోళనలకు దిగారు. శుక్రవారం పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఓ దశలో లాఠీ చార్జీ కూడా జరిగింది. అయినా ఉద్యోగాలు పీకేస్తే ఆందోళనలు కాని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడం మంచిదే కదా అని విద్యార్థులను ప్రశ్నిస్తే, "మీకేం బాగానే చెబుతారు, ఉన్న ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు సిబ్బందితో భర్తీ చేస్తే, మరి మా పరిస్థితి ఏంటి?" అని నిలదీస్తున్నారు. కరెక్టే మరి, కొత్తగా ఉద్యోగాలొస్తేనే కదా, విద్యార్థులకు అవకాశం దక్కేది. అందుకే తెలంగాణ సర్కారు పరిస్థితి, కరవమంటే కప్పకు... విడవమంటే పాముకు కోపమన్నట్లు తయారైంది!