: వైజాగ్-చెన్నై కారిడార్ నిధుల బాధ్యత ఎవరిది?
విశాఖ పట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైనట్లే. అయితే ఇందుకు అవసరమయ్యే నిధులు ఎవరు సమకూర్చుతారన్న అంశమే తేలలేదు. ఈ కారిడార్ ఏర్పాటు బాధ్యతను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కు అప్పగిస్తూ ఇటీవలే ఏపీ పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో, ఈ కారిడార్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా ఏడీబీనే భరిస్తుందని ఏపీ సర్కారు భావిస్తోంది. అదే విషయాన్ని వల్లె వేస్తోంది కూడా. అయితే కారిడార్ లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల బాధ్యత మాత్రం సర్కారుదేనని ఏడీబీ వాదిస్తోంది. శుక్రవారం ఏడీబీ ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కారిడార్ కు సంబంధించి వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కూడా ఇచ్చింది. కారిడార్ లో మౌలిక సదుపాయాల కింద ఎయిర్ పోర్టులు, పోర్టులు, రైల్వే లైన్లు, రహదారులు తదితరాల ఏర్పాటు సర్కారు బాధ్యతేనని సదరు ప్రతినిధి బృందం తేల్చి చెప్పింది. అదెలా కుదురుతుంది, కారిడార్ ఏర్పాటు బాధ్యతలు తీసుకున్న ఏడీబీనే కారిడార్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించాలని ఏపీ అధికారులు వాదించారట. దీంతో ఏం చేయాలో పాలుపోని ఏడీబీ అధికారులు, ఆగస్టు 10న మళ్లీ కలుస్తామంటూ వెళ్లిపోయారట. మరి ఆ భేటీలోనైనా స్పష్టమైన విధివిధానాలు ఖరారవుతాయో, లేదో చూడాలి.