: మద్యం అమ్మకాలపై నగర వ్యాపారుల అనాసక్తి
హైదరాబాద్ నగర పరిధిలో మద్యం అమ్మకాల జోరు తగ్గిందనే చెప్పొచ్చు. ఇదేదో మందుబాబుల గురించి చెబుతున్నది కాదు. మందుబాబుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ, నగరానికి చెందిన లిక్కర్ వ్యాపారులు, ఈ వ్యాపారం నిర్వహించేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడమే కారణమట. అయితే ఆదాయం లేక కాదని, నిర్వహణ భారం తడిసిమోపెడవుతున్నదని వాపోతున్న లిక్కర్ వ్యాపారులు ఈ దిశగా అంతగా ఆసక్తి చూపడం లేదని సాక్షాత్తు అబ్కారీ శాఖే చెబుతోంది. మొన్నటి లిక్కర్ టెండర్లలో నగరంలో మొత్తం 212 మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానించగా కేవలం 156 షాపులకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. మిగిలిన 56 షాపుల ఏర్పాటు కోసం అబ్కారీ శాఖ సిబ్బంది వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా వ్యాపారుల నుంచి స్పందన కనిపించడం లేదట. 'మద్యం షాపు నిర్వహించేందుకు అవసరమైన అద్దె గదిని కూడా మేమే వెతికిపెడతాం, రండి బాబూ' అని పిలుస్తున్నా, 'అబ్బే... మావల్ల కాదులెండి సార్' అంటూ వ్యాపారులు తప్పించుకుంటున్నారట. మరికొందరు వ్యాపారులు 'షాపుకు గది అయితే చూపించారు, ఇంత ఇరుకు గది షాపుకు ఓకే, మరి పర్మిట్ రూం ఏర్పాటెలా?' అంటూ ప్రశ్నిస్తుండటంతో అబ్కారీ అధికారులు తలలు పట్టుకుంటున్నారట. నిర్దేశించిన మేర షాపులను ఏర్పాటు చేయించండని ఓవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు, మరోవైపు వ్యాపారుల అనాసక్తి నేపథ్యంలో ఎక్సైజ్ సిబ్బంది పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఇప్పటికే మూడుసార్లు టెండర్లను ఆహ్వానించిన అధికారులు, ఇక లాభం లేదని గతేడాది షాపులను నిర్వహించిన వ్యాపారులను నేరుగా కలుస్తున్నా ఫలితం కనిపించడం లేదు.