: అక్రమ నిర్మాణాల కూల్చివేతపై పీటముడి!
హైదరాబాద్ లో అక్రమంగా వెలసిన నిర్మాణాల కూల్చివేతపై గంరగోళ పరిస్థితి నెలకొంది. తెలంగాణ సర్కారు మౌఖిక ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, పలు ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసింది. గుర్తించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. అయితే ఉన్నట్లుండి జీహెచ్ఎంసీ పాలకవర్గం దీనిపై భగ్గుమంది. తొలుత నాలుగైదు రోజులు అంతగా పట్టించుకోని పాలకవర్గం, కూల్చివేతలను నిలిపివేయాలని రెండు రోజుల క్రితం తీర్మానం కూడా చేసేసింది. దీంతో ఈ విషయంలో పాలకవర్గానికి, అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. మరోవైపు పాలకవర్గంలోని మజ్లిస్ ఎమ్మెల్యేలు కూల్చివేతలపై నోరు మెదపడం లేదు. మజ్లిస్ మినహా మిగిలిన కార్పొరేటర్లు మాత్రం కూల్చివేతలను నిలిపివేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కూల్చివేతలను నిలపాలని వాదిస్తున్నారు. అంతేకాక అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన మధ్యతరగతి ప్రజలు కూడా కూల్చివేతలపై ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. దీంతో కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగే అవకాశాలూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ తీర్మానం కన్నా, సర్కారు మౌఖిక ఆదేశాలే తనకు శిరోధార్యమంటూ కమిషనర్ సోమేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. పాలవకర్గం తీర్మానంపై ఆయన వద్ద ప్రస్తావించగా, దీనిపై సర్కారుకు లేఖ రాస్తానని ఆయన చెప్పారు.