: నేడు కేసీఆర్ తో బిర్లా, మహీంద్రాల భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో శనివారం బిర్లా గ్రూపు అధినేత సీకే బిర్లా భేటీ కానున్నారు. సీకే బిర్లా కంపెనీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఎలాంటి పెండింగ్ ప్రాజెక్టులు లేవు. ఈ నేపథ్యంలో సీకే బిర్లా కొత్తగా పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలతో రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. పారిశ్రామిక వర్గాలకు భారీగా ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాక కొత్త పారిశ్రామిక విధానాన్ని కూడా ఖరారు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తో సికే బిర్లా భేటీ కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా కుడా శనివారమే కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఇప్పటికే మహీంద్రా కంపెనీ, మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద ట్రాక్టర్ల యూనిట్ తో పాటు పలు వాహన విడిభాగాలకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేసింది. తాజాగా, ఫోర్ వీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు మరిన్ని కొత్త యూనిట్లను హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు ఆ గ్రూపు ఆసక్తి కనబరుస్తోంది. ఆనంద్ మహీంద్రా కూడా కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలపైనే కేసీఆర్ తో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.