: నెల్సన్ మండేలాకు నివాళి అర్పించిన గూగుల్


దివంగత నెల్సన్ మండేలా 96వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ ‘నల్లజాతి సూరీడు’కి నివాళులర్పించింది. ఇవాళ్టి గూగుల్ హోం పేజీలో చక్కటి డూడుల్ కు రూపకల్పన చేసింది. ఈ ఇంటారాక్టివ్ డూడుల్ లో మండేలా జీవిత ఘట్టాల గురించి వివరించింది. ఆయన ప్రసంగాల్లోని ముఖ్యమైన అంశాలను నెటిజన్లకు అందించే ప్రయత్నం చేసింది. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా, దక్షిణాఫ్రికా దేశ మాజీ అధ్యక్షుడు, కేప్ ప్రాంతంలోని ఉమటా జిల్లా, మవెజోలో 1918వ సంవత్సరం జూలై 18వ తేదీన జన్మించాడు. దక్షిణాఫ్రికాకు పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన తొలి నాయకుడిగా మండేలా కీర్తి గడించారు. అధ్యక్షుడు కాక మునుపు ఆయన జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడిగా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే’కు అధ్యక్షుడిగా పనిచేశారు. జాతిహిత మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస తనకు ఎంతో స్పూర్తినిచ్చాయని మండేలా చాలాసార్లు వెల్లడించారు. భారత్ మండేలాను భారతరత్న, ‘జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య’ బహుమతితో సత్కరించింది. ఢిల్లీలో ఆయన పేరుతో ‘నెల్సన్ మండేలా రోడ్’ ఉంది. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు ఆయనను గౌరవించాయి. 1993లో మండేలా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1994లో మండేలా 77 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేపట్టారు. రెండవసారి ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించిన మండేలా 1999లో పదవీ విరమణ చేశారు.

  • Loading...

More Telugu News