: 'అమ్మ హస్తం' స్థానంలో ఇక 'ఎన్టీఆర్ సుభిక్ష'
రేషన్ షాపుల ద్వారా తొమ్మిది నిత్యావసరాలను పంపిణీ చేసిన అమ్మహస్తం పథకం... పేరుతో పాటు స్వరూపాన్ని కూడా మార్చుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన 'అమ్మహస్తం' ఆదిలోనే అభాసుపాలైంది. సరుకుల నాణ్యతతో పాటు పంపిణీలో జాప్యం కూడా ఈ పథకం విఫలమయ్యేందుకు కారణమయ్యాయి. అయితే ఈ పథకం సదుద్దేశంతో కూడుకున్నది కావడంతో, ఇటీవలే పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు సర్కారు కూడా దీనిని కొనసాగించేందుకే దాదాపు సిద్ధపడింది. అయితే పేరుతో పాటు పథకం రూపురేఖల్ని కూడా మార్చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ పథకాన్ని కొనసాగించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎన్టీఆర్ సుభిక్ష అన్న పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక పథకం కింద సరఫరా చేస్తున్న సరుకుల్లో మార్పులుచేర్పులు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారట. నాణ్యత లేని, నెలానెలా అవసరం లేని కారం, పసుపు, చింతపండులను జాబితా నుంచి తీసేసేందుకు తీర్మానించారట. అరకిలో చొప్పున ఇస్తున్న చక్కెరను కిలోకు పెంచడంతో పాటు గోధుమ రవ్వ, రాగులు, సాంబారు పొడి, పామోలిన్ లను కొత్తగా జత చేయనున్నారట. ఈ నెల 21న జరగనున్న మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.