: కౌలు సాగులో సీన్ రివర్స్..!


ఖరీఫ్ సీజన్ మొదలు కాకముందే సాగు భూముల కోసం కౌలు రైతులు చక్కర్లు కొట్టేవారు. అదే అదనుగా భూ యజమానులు కూడా రేట్లను ఏటేటా పెంచేస్తూ, ఇంటిపట్టునే కూర్చుని బాగానే సంపాదించే వారు. ఇది గతేడాది దాకా కొనసాగిన తంతు. అయితే, ఈ ఏడాది కృష్ణా జిల్లాలో పరిస్థితి రివర్సైనట్లే కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్నా, నేటికీ వాన చుక్క లేకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. అంతేకాక, ఈ ఏడాది సాగు తమ వల్ల కాదని కౌలు రైతులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏటా పొలాన్ని కౌలుకిచ్చేసి వేరే వ్యాపకాల్లో మునిగే భూ యజమానులు బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చినా ఫలితం కనిపించేలా లేదు. సాగులోకి దిగే ముందే, కౌలు పైకం చెల్లించాలని నిన్నటిదాకా డిమాండ్ చేసిన భూ యజమానులు తాజాగా వరుణుడి నిర్దయ నేపథ్యంలో కౌలు సొమ్ము పంట తర్వాత ఇచ్చినా ఫరవాలేదనే స్థితికి వచ్చారు. అయినా, ముందుకు రాని కౌలు రైతును ప్రసన్నం చేసుకునేందుకు ధర కాస్త తగ్గిస్తాం లెమ్మంటూ కబురు చేస్తున్నారు. ఈ ఆఫర్ కూ కౌలు రైతు అడుగు ముందుకేయకపోవడంతో ఏకంగా సాగుకయ్యే ఖర్చును వడ్డీ లేని రుణం కింద ఇస్తామని బంపర్ ఆఫర్ నూ ప్రకటించేస్తున్నారు భూ యజమానులు. దీనికి ప్రభావితం కాని కౌలు రైతు, అసలు పండిన పంట చేతికొచ్చే పరిస్థితులున్నాయా? అంటూ ఆరా తీయడంపై దృష్టి సారించాడు. మరేం జరుగుతోందో ఓ పది రోజులు ఆగితే కాని తేలేలా లేదు.

  • Loading...

More Telugu News