: విశాఖ పాస్ పోర్టు కార్యాలయ పరిధిలోకి 13 జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 13 జిల్లాలకు చెందిన పాస్ పోర్టు సేవలను ఇకపై విశాఖలోని పాస్ పోర్టు కార్యాలయం అందించనుంది. ఆ మేరకు కేంద్రం నుంచి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కేవలం ఐదు జిల్లాల పాస్ పోర్టు సేవలను మాత్రమే ఈ కేంద్రం అందిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి, విజయవాడల్లోని పాస్ పోర్టు సేవల కేంద్రాలను కూడా విశాఖ కార్యాలయ పరిధిలోకే తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయ హోదాను ప్రధాన కార్యాలయానికి పెంచడంతో పాటు ఏటా 26 శాతం మేర వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో విశాఖలోనే మరో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత కార్యాలయం ఉన్న చోటే దాదాపు 11 కౌంటర్లతో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశాఖపట్టణం పాస్ పోర్టు అధికారి చౌధరి చెప్పారు. విశాఖ పాస్ పోర్టు కార్యాలయం హోదా పెరిగితే, ధృవ పత్రాల పరిశీలన కోసమే రెండు నెలల సమయం వేచి చూడాల్సిన దుస్థితి ఇక ఎదురు కాదు.