: టి సర్కార్ తో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ల 'ఢీ'!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలు, నిర్మాణాలను కూల్చివేయడం రోజు రోజుకు వివాదస్పదమవుతోంది. జీహెచ్ఎంసీ వరుసగా కూల్చివేతలకు దిగటంతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు బాగా పరేషాన్ అవుతున్నారు. పలు నిర్మాణాల విషయంలో తెలంగాణ సర్కార్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు గళమెత్తారు. అక్రమనిర్మాణాల కూల్చివేత జరుగుతున్న ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ధర్నా చేశారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తుండడంతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని వారు టి సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రాతిపదికన కొన్ని నిర్మాణాలు అక్రమమని గుర్తించారో తమకు అర్థం కావడం లేదని వారు అంటున్నారు. నిన్న జరిగిన జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో సైతం నిర్మాణాల కూల్చివేతను ఆపివేయాలంటూ తీర్మానం చేశారు. అన్యాయంగా జరుగుతున్న నిర్మాణాల కూల్చివేత్త వెంటనే ఆపకపోతే తాము భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు