: హెచ్ బీఓ ఛానెల్ పై కన్నేసిన మర్డోక్
ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫ్యాక్స్ అధినేత రూపర్ట్ మర్డోక్ చేతిలోకి హెచ్ బీఓ ఛానెల్ వెళ్లిపోయినట్టేనన్న వార్తలు జోరందుకున్నాయి. హెచ్ బీఓపై మనసు పారేసుకున్న మర్డోక్, ఎలాగైనా, ఎంత డబ్బు చెల్లించైనా సరే ఆ ఛానెల్ ను కొనుగోలు చేయాల్సిందేనని తీర్మానించేసుకున్నారని ప్రపంచ మీడియా కోడై కూస్తోంది. హెచ్ బీఓలో ప్రస్తుతం ప్రసారమవుతున్న సినిమాలే కాక ప్రజాదరణ పొందిన 'గేమ్ ఆఫ్ థ్రోన్', 'గర్ల్స్' వంటి కార్యక్రమాలు మర్డోక్ మనసును దోచుకున్నాయట. అంతేకాదండోయ్, హెచ్ బీఓ భారీ లాభాలను ఆర్జిస్తోందట. గతేడాది 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై ఏకంగా 1.9 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని అందించిందట. దీంతో హెచ్ బీఓపైకి మర్డోక్ మనసు మళ్లింది. మనసుకు నచ్చిన ఛానెల్ ను ఎలాగైనా చేజిక్కించుకోవాల్సిందేనని తీర్మానించేసుకున్న మర్డోక్, హెచ్ బీఓను నిర్వహిస్తున్న టైమ్ వార్నర్ గ్రూపునే కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం గ్రూపును విలీనం చేస్తే, రూ.4.8 లక్షల కోట్లు ఇస్తానంటూ భారీ ఆఫరిచ్చారట. మర్డోక్ మనసులోని మాట తెలుసుకుందో, ఏమో తెలియదు కాని, కాస్త మొండికేస్తే మరింత మంచి ధర వస్తుంది కదా అన్న ఉద్దేశంతో టైమ్ వార్నర్ కూడా కాదు పొమ్మందట. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా మరో భారీ ఆఫర్ ను ప్రతిపాదించేందుకు మర్డోక్ ప్రణాళికలు వేస్తున్నారట. మనసుదోచిన ఛానెల్ కోసం మర్డోక్, ఎంత మేర ఆఫర్ చేస్తారో చూద్దాం.