: ఇక సినీ స్టూడియోలపై కేసీఆర్ సర్కార్ 'ఫోకస్'


హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్న కేసీఆర్ సర్కార్ తాజాగా తన దృష్టిని సినీ స్టూడియోలపై సారించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను ఉద్దేశిత అవసరాలకు కాకుండా మరో అవసరానికి వాడినా.... లేదా, అసలు వాడకుండా ఖాళీగా ఉంచినా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా అన్నపూర్ణ, పద్మాలయా స్టూడియోలపై దృష్టి సారించింది టి. సర్కార్. ఈ రెండు స్టూడియోల వ్యవహారాలలో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండడంతో జాగ్రత్తగా ముందుకువెళ్లాలని జి.హెచ్.ఎం.సి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో కొంత భాగాన్ని రిలయన్స్ సంస్థకు లీజు ఇచ్చారు. ఇది నిర్దేశిత జీ.వోకు వ్యతిరేకంగా ఉందని... దీని ఆధారంగా అన్నపూర్ణ స్టూడియోపై చర్యలకు రంగం సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది. ఇక, నటుడు కృష్ణకు చెందిన పద్మాలయా స్టూడియో భూములను స్వాధీనం చేసుకోవాలని ఏడాది కిందటే హైదరాబాద్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పద్మాలయా స్టూడియోకు 9 ఎకరాలు కేటాయించగా... దీనిలో 5 ఎకరాలను స్టూడియో యాజమాన్యం 'జీ' టెలీఫిలిం సంస్థకు విక్రయించింది. ఈ ఐదెకరాల స్థలాన్ని 2005 లో వై.ఎస్ సర్కార్ స్వాధీనం చేసుకుంది. అయితే కాలక్రమంలో వై.ఎస్ ప్రభుత్వానికి... పద్మాలయా యాజమాన్యానికి కుదిరిన 'రాజీ'తో తిరిగి ఆ స్థలం పద్మాలయా హస్తగతమైంది. ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News