: బ్యాట్ సైజుతో ఇబ్బందేమీ లేదంటున్న వరల్డ్ క్రికెట్ కమిటీ
క్రికెట్ బ్యాట్ సైజుతో ఇప్పుడొచ్చిన ఇబ్బందేమీలేదని ఎంసీసీకి చెందిన వరల్డ్ క్రికెట్ కమిటీ అభిప్రాయపడింది. దానికి సంబంధించిన నిబంధనలను సవరించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. కాగా, క్రికెట్ అంటే బ్యాట్స్ మెన్ గేమ్ అని, బౌలర్ల అవకాశాలనూ మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని క్రికెట్ పండితులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లండన్ లో సమావేశమైన వరల్డ్ క్రికెట్ కమిటీ బ్యాట్ సైజు నిబంధనలు మార్చడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉపఖండంలోని బ్యాట్స్ మెన్ హెవీ బ్యాట్లతో పరుగుల వర్షం కురిపిస్తుండడంపై ఇప్పటికే పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, క్రికెట్ బ్యాట్ల అంచులు, వెడల్పు తగ్గించాలన్న విషయంపై ఎంసీసీ పెద్దగా దృష్టి సారించలేదని, అయితే ప్రస్తుత ఆట సరళిని నిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడిందని వరల్డ్ క్రికెట్ కమిటీ పేర్కొంది.