: అధికారిక పత్రాల్లో తల్లి పేరుపై వైఖరి చెప్పండి: రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
చిన్న పిల్లలు, విద్యార్థులకు సంబంధించిన అధికారిక పత్రాలపై తల్లి పేరును విధిగా పేర్కొనాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం చిన్నారులకు సంబంధించిన అధికారిక పత్రాలు, అఫిడవిట్లలో తండ్రి పేరును విధిగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. తల్లి పేరును మాత్రం ఆయా వర్గాల ఐచ్ఛికతకు వదిలేశారు. తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా విధిగా పేర్కొనేలా చట్టం చేయాలన్న పాత్రికేయుడు మాధవ్ కాంత్ మిశ్రా పిటిషన్ పై విచారణ చేసిన ధర్మాసనం, తల్లి పేరును కూడా విధిగా పేర్కొనేలా చర్యలు చేపట్టడం ద్వారా మహిళలకు మరింత ప్రాముఖ్యత ఇచ్చినట్లవుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.