: 'జడ్జిమెంట్' సినిమా లాంటి కథే... నిజంగా జరిగింది!


ఒక్కోసారి అలాగే జరుగుతుంటుంది! వెండితెరపై కనిపించిన దృశ్యమే మన జీవితంలో నిజమవుతుంది. 90లలో వచ్చిన 'జడ్జిమెంట్' సినిమాలో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే, సినిమాలో పాపకోసం తల్లులిద్దరు కోర్టుకెక్కగా, ఇక్కడ తండ్రులిద్దరు న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాల్లోకెళితే... 2007 వరుస బాంబు పేలుళ్ల ఘటన ఫాతిమా అనే పాపను అనాథను చేసింది. మూడున్నరేళ్ల ఫాతిమా తండ్రితో కలిసి హైదరాబాద్ కోఠీలో గల గోకుల్ ఛాట్ కు వెళ్లింది. అప్పుడే సరిగ్గా బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. తండ్రి కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఫాతిమాను పాపాలాల్ రవికాంత్, జయశ్రీ అనే హిందూ దంపతులు చేరదీశారు. ఫాతిమా పేరును అంజలిగా మార్చి పెంచుకుంటున్నారు. ఇంతలో వారికి సంతానం కలిగింది. అంజలి తమ ఇంట కాలుమోపిన వేళావిశేషం అంటూ పాపను అదృష్టదేవతగా భావించి మరింత అపురూపంగా పెంచుకుంటున్నారు. ఏడేళ్లు గడిచిన తరువాత అంజలి తండ్రినని అత్తాపూర్ కు చెందిన సయీద్ యూసఫ్ జూన్ 30న పోలీసులను ఆశ్రయించి, తన కుమార్తెను తనకు అప్పగించాలని కోరాడు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల తరువాత తన కుమార్తె ఫోటో టీవీలో చూసి గుర్తుపట్టానని, పేదరికం కారణంగా ఇంత కాలం వెతకలేదని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఫాతిమా అతని కుమార్తె అవునో?, కాదో? తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతికోసం పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఇన్నాళ్లూ కుమార్తెను గాలికొదిలేసిన తండ్రి, ఇప్పుడు అకస్మాత్తుగా ఊడిపడి కావాలంటే ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని అంజలి పెంపుడు తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. మరి, ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో?

  • Loading...

More Telugu News