: మందు కొట్టి చొక్కా విప్పిన ఇంగ్లండ్ క్రికెటర్... కోచ్ వార్నింగ్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆశాకిరణం గారీ బల్లాన్స్ కోచ్ ఆగ్రహానికి గురయ్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్ తో తొలి టెస్టు ముగియగానే నేరుగా బారు బాట పట్టిన బల్లాన్స్ పూటుగా బీరు పట్టించి చిందులేశాడు. చేతిలో బీరు క్యాన్ పట్టుకుని చొక్కా విప్పి హల్ చల్ చేశాడు. ఈ టాప్ లెస్ ఫొటోలు తర్వాతి రోజు వార్తాపత్రికల్లో రావడంతో ఇంగ్లండ్ జట్టు మేనేజ్ మెంట్ సీరియస్ అయింది. కోచ్ పీటర్ మూర్స్ ఈ వ్యవహారంలో బల్లాన్స్ ను కాస్త గట్టిగానే మందలించి వదిలేశాడు. అయితే, నేడు ఆరంభమయ్యే లార్డ్స్ టెస్టులో ఈ యువ క్రికెటర్ ఆడాల్సి ఉండడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలేవీ ఉండబోవని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా, ఆ ఫొటోలు తీసింది మరో మందుబాబేనట. బాగా తాగి కిక్కెక్కిన స్థితిలో బల్లాన్స్ "ఇంగ్లండ్! ఇంగ్లండ్! ఇంగ్లండ్!" అంటూ వెర్రికేకలు పెట్టినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.