: సినీ నిర్మాతపై మరో నిర్మాత దాడి
ఓ సినీ నిర్మాతపై మరో నిర్మాత దాడి చేసిన వైనం హైదరాబాదులోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. బీజీ వెంచర్స్ నిర్మాత తడకల రాజేష్ పై మరో నిర్మాత, అతని అనుచరులు దాడి చేసి కారు తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... రోడ్ నెంబర్ 10లో నిర్మాత రాజేష్ కు కార్యాలయం ఉంది. 'వేట', 'ఉడతా ఉడతా ఊచ్','కుమార్ వర్సెస్ కుమారి' అనే సినిమాలను ఆయన నిర్మించారు. తాజాగా కొత్త చిత్రం నిర్మాణానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి మరో నిర్మాత మహేందర్ తో రాజేష్ కు ఒప్పందం కుదిరింది. ఇందుకుగానూ రాజేష్ కు మహేందర్ రూ.11 లక్షలు ఇచ్చాడు. హఠాత్తుగా ఏమైందోకానీ సినిమా మొదలు కాకుండానే తన డబ్బు తిరిగివ్వాలని నిర్మాత మహేందర్ ఒత్తిడి చేశాడు. అయితే, ఆ డబ్బును అప్పటికే హీరో శివబాలాజీ, ఇతర టెక్నీషియన్లకు అడ్వాన్సుగా ఇచ్చానని రాజేష్ చెప్పాడు. అయినా వినిపించుకోని మహేందర్ రెండు రోజుల కిందట (మంగళవారం) ఓ పదిహేనుమందితో కలసి రాజేష్ కార్యాలయంపై దాడి చేశాడు. నిర్మాతపై చేయిచేసుకుని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాంతో, నిర్మాత రాజేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.