: తడలో టాలీవుడ్ సినీ స్టూడియో!


నెల్లూరు జిల్లాలోని తడ టాలీవుడ్ స్టూడియోలకు కేంద్రబిందువు కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ సినీ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను సమకూర్చుకోవాల్సిందేనన్న భావనకు తెలుగు సినీ నిర్మాతలు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని వసతులతో తులతూగుతున్న విశాఖ, అందుకు అనుగుణంగా ఉంటుందని తొలుత భావించారు. అయితే దూరాభారం నేపథ్యంలో ఆ యత్నాలను విరమించుకున్న ప్రముఖ నిర్మాత ఒకరు తాజాగా నెల్లూరు జిల్లా వైపు దృష్టి సారించారు. పర్యాటకులను భారీగా ఆకర్షిస్తున్న తడ అయితే ఎలాగుంటుందని ఆరా తీసిన ఆయనకు, అదే సరైన స్థలమని తోచిందట. దీంతో అక్కడ ఓ భారీ స్టూడియో నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. తడ సమీపంలో పులికాట్ సరస్సు, నేలపట్టు, మైపాడ్ బీచ్ తో పాటు అతిపొడవైన సముద్రతీరం ఉన్న అంశాలు ఆయనను ఆ దిశగా ఆకర్షించాయని సమాచారం. దీంతో తడ సమీపంలో 3 వేల ఎకరాల మేర స్థలాన్ని సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తడ, చెన్నైకి సమీపంలో ఉన్న నేపథ్యంలో తెలుగు సినిమాలే కాక తమిళ సినిమాల నిర్మాణానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. మరోవైపు చెన్నై నుంచి నటులను, సాంకేతిక నిపుణులను దిగుమతి చేసుకోవడం కూడా సులువేనని భావిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన సినీ ప్రముఖులు కూడా ఆ దిశగానే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తడతో పాటు చిత్తూరు జిల్లాలోనూ స్టూడియోల నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందనే అంశంపైనా ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ నడుస్తోందట.

  • Loading...

More Telugu News