: టీవీలో సుదీర్ఘ చర్చావేదికతో రికార్డు
మన తెలుగు టీవీ ఛానెళ్లు 24 గంటలు వార్తా ప్రసారాలు అందించడానికి పాపం.. గంటల తరబడి చర్చావేదికలు నిర్వహించడం ద్వారా సమయాన్ని ఫిల్ చేసుకుంటూ ఉంటాయి. కానీ.. అవసరం ఇదే కాకపోవచ్చు గానీ.. ఇదే పనిని అతి సుదీర్ఘకాలం పాటూ చేయడం ద్వారా నేపాల్‌లోని ఒక టీవీ వ్యాఖ్యాత ప్రపంచ రికార్డును సృష్టించి గిన్నిస్‌లోకి ఎక్కాడు.
'బుద్ధ భగవానుడు నేపాల్ లోనే పుట్టాడు' అనే అంశం మీద సాగించిన ఈ చర్చా కార్యక్రమం 62 గంటల 12 నిమిషాల పాటు ఏకధాటిగా సాగింది. దీన్ని వ్యాఖ్యాత రబీ లమిచానె నిర్వహించారు. గతంలో ఇలాంటి రికార్డులు రెండు ఉండగా, వాటిని రబీ బద్దలు కొట్టాడు. నేపాల్‌లో ప్రముఖులు అనేక మంది ఈ టాక్ షోలో పాల్గొనగా.. గిన్నస్ బుక్ వారు నిబంధనల ప్రకారం గంటకు అయిదు నిమిషాల వంతున అతనికి విరామం ఇచ్చారు. ఖాట్మండు లోని న్యూస్ 24 స్టుడియోలో నిర్వహించిన ఈ షో ప్రత్యక్ష ప్రసారం వెబ్ ద్వారా జరిగింది.